హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హైటెక్స్‌లో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 13వ మూకాంబిక రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో- 2023ను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక యంత్రాల పనితీరుపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైస్ ఇండస్ట్రీ ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకొనే ఉద్దేశంతో ఎక్స్పోను ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రులు అభినందించారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిల్లర్లకు మేలు
సీఎం కేసీఆర్ రైతు అనుకూల, దూరదృష్టి విధానాలతో రైస్ మిల్లర్లకు ఎంతో మేలు కలుగుతున్నదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు కొనియాడారు. 100 నుంచి 125 హెచ్‌పీ వరకు ఎల్టీ క్యాటగిరీలో చేర్చడం, బియ్యంపై మారెట్ ఫీజ్ ఒక శాతాన్ని మాఫీ చేయడం, సీ ఫారం సమస్య పరిషారం, నూతన మిల్లుల కోసం జోన్ల ఏర్పాటు వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వం మిల్లర్లకు అండగా నిలిచిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైస్ ఇండస్ట్రీకి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శులు అన్నమనేని సుధాకర్‌రావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.