Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఆపారని మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) తెలిపారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కానీ పరిస్థితి ఏర్పడిందని గవర్నర్‌పై మంత్రి మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇవాళ రెండు మూడు బిల్లులు పాస్ చేశారు. బీజేపీ కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రగతిని ఎంతగా అడ్డుకుంటుందో గమనించాలన్నారు.
ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? అని ప్రశ్నించారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మా పిల్లలకు ప్రొఫెసర్లు చదువులు చెప్పొద్దా? అని నిలదీశారు. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డును 1961 నుంచే అమలు చేస్తున్నారు.
గవర్నర్ తీరు సబబేనా? ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తే రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయం ఏంటి అనేది అందరికి తెలుసన్నారు. గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని మంత్రి ధ్వజమెత్తారు. సరైన సమయంలో కేంద్రానికి తెలంగాణ సమాజం గుణపాఠం చెబుతుందన్నారు మంత్రి హరీశ్‌రావు.