Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రారంభించేందుకు సిద్దం చేయాలని చెప్పారు. గ్రేటర్ పరిధితో పాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్‌కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నుండి నెలవారీగా వీటి పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు పురోగతి నివేదికలతో సిద్దంగా ఉండాలని హరీశ్‌రావు ఆదేశించారు.
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు సంబంధిత అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయితే మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్ అండ్ బీ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలిసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే, కిడ్నీ బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 102 కు పెంచుకున్నట్లు చెప్పారు. ప్రారంభానికి సిద్దంగా ఉన్న డయాలిసిస్ కేంద్రాలు స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. మూడు క్లస్టర్స్ గా విభజించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు పరిశీలన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. బాధితులకు నిరంతర సేవలు అందేలా కృషి చేయాలని ఆదేశించారు.