హైదరాబాద్ : మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్వోబీలు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లకు సంబంధించి స్థల సేకరణ, చెల్లించాల్సిన పరిహారంపై మండలాలవారీగా అరణ్య భవన్‌లోని మంత్రి కార్యాలయంలో సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
రైల్వే లైన్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వమే రైల్వేశాఖకు ఉచితంగా స్థలాన్ని అందజేస్తున్నది. సిద్ధిపేట జిల్లాలో 1,421 ఎకరాలకు గాను 1,315 ఎకరాలు సేకరించామని, మెదక్ జిల్లాలో 174 ఎకరాలకు, 172 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు వివరించారు. సిద్ధిపేట జిల్లాలో భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా స్థల సేకరణ చేసిందో.. అదే విధంగా రైల్వే పనులు వేగవంతం చేయాలని సూచించారు.
త్వరితగతిన రైలు మార్గాలను పూర్తి చేసి, జనవరి వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని డివిజనల్ రైల్వే మేనేజర్‌ను కోరారు. సంబంధిత ఇతర శాఖల అధికారులు కూడా సహకరించి పనులు త్వరితగతిన అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హన్మంతరావు, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కన్స్ట్రక్షన్ సధర్మ దేవరాయలు తదితరులు పాల్గొన్నారు.