Minister Harish Rao | హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు( demonetisation ) అట్టర్ ఫ్లాప్ అయిందని, దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యావసనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దేశ ప్రజలకు ప్రధాని మోదీ( PM Modi ) క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ భవన్( BRSLP Bhavan )లో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే ఒప్పుకుందని మంత్రి గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ నేతలు( BJP Leaders ) ఎందుకు మాట్లాడరు..? చలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవి అన్ని అబద్దాలే అని పేర్కొన్నారు. దొంగనోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్లు ఆర్బీఐ( RBI )నే చెప్పిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలు వాడే నగదు తక్కువ. ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయింది. 2014కు ముందు దేశ జీడీపీ( GDP )లో 11 శాతం నగదు ఉండేది. ప్రస్తుత దేశ జీడీపీలో 13 శాతానికి పైగా నగదు చలామణిలో ఉంది. పెద్ద నోట్ల వాడకం పరిమితం కాలేదు.. రెట్టింపు అయిందని పేర్కొన్నారు.
దేశంలో నల్లధనం( Black Money ), అవినీతి పెరిగినట్లు తెలుస్తుందని హరీశ్‌రావు తెలిపారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా( Drugs ), టెర్రరిజం( Terrorism ) పెరిగిపోయింది. కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ప్రధాని చెప్పిన 5 ట్రిలియన్ ఎకానమీ ఒక జోక్. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలైన్లో నిలబడి 108 మంది చనిపోయారు. పెద్ద నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో వంద లక్షల కోట్లు అప్పు చేసింది. దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.