గతంలో ఎన్నడూ లేని విధంగా వడగండ్ల వర్షం పడటంతో పంట నష్టం ఎక్కువగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత రైతులను ఆదుకుంటాం. సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టే రైతులను కాపాడుకుంటున్నారు. పంట నష్టంపై వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించాం. ఏ ఒక్క రైతునూ విడిచి పెట్టకుండా లెక్కలు సేకరించాలని ఆదేశాలిచ్చాం. – మంత్రి హరీశ్‌రావు
Minister Harish rao | సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీరు ఎవరూ అధైర్యపడవద్దు’ అంటూ రైతులను ఓదార్చారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నదని, రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ ఉన్నారని, రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగానే కేంద్రం కూడా ఎకరాకు మరో రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని దాదాపు 25 గ్రామాల్లో పర్యటించి రైతులను ఓదార్చారు. మంగళవారం కురిసిన అకాలవర్షాలకు పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు బుధవారం వేకువజామునే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు చేరుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేలవాలిన మక్కజొన్న పంట చూపిస్తున్న ఓ రైతు
ఉదయం ఏడు గంటల కల్లా సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చేరుకుని పంటలను పరిశీలించారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పర్యటన సిద్దిపేట అర్బన్, రూరల్, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో సాయంత్రం వరకు కొనసాగింది. ఆయా గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతినడం చూసి చలించిపోయారు. రైతుల కన్నీళ్లు చూసి అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగండ్ల వర్షం పడటంతో కొన్ని మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. వరి పంటతోపాటు మల్బరీ, మామిడి, కూరగాయల తోటలకూ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే వడగండ్ల వానపడ్డ ప్రాంతాల్లో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని గుర్తుచేశారు. దేశంలో రూ.2 వేల నుంచి 3 వేలు కూడా పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టే రైతులను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వివరాలు వచ్చాయని, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఎంత పంట నష్టం జరిగిందనే వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. గ్రామాల్లో నష్టపోయిన ఏ ఒక్క రైతునూ విడిచి పెట్టకుండా లెక్కలు సేకరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని చెప్పారు. కొన్నిచోట్ల పంటలు నష్టపోవడమే కాకుండా పాడి పశువులు చనిపోయాయని, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయని వివరించారు. రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం, పంట నష్టపోయిన రైతులను సైతం కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు పంట సమయాన్ని కొంత ముందుకు జరుపుకొంటే వడగండ్లతో నష్టపోయే బాధ తప్పుతుందని సూచించారు. డిసెంబర్లో రైతులు వరినాట్లు వేస్తే శ్రీరామనవమి లోపు చాలాచోట్ల పంట కోతలు పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం విక్రయించారని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వివరించారు. పంట నష్టం వివరాలు సేకరించి వానకాలం సాగు మొదలయ్యేలోగా రైతులకు నష్టపరిహారం అందజేస్తామని అభయమిచ్చారు.
కేంద్రం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన కేంద్రానికి ఉంటే తమ వంతుగా మరో రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా పథకాలను సీఎం కేసీఆర్ తీసుకు వచ్చారని చెప్పారు. యాసంగిలో తెలంగాణలో పండే బాయిల్డ్ రైస్ కేంద్రం తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నదని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌రావు: ఎన్ని ఎకరాలు ఏశినవ్.. (ఏడుస్తున్న మహిళా రైతులను ఓదారుస్తూ..)
మహిళా రైతు: మాకు రెండు ఎకరాలే ఉన్నది.. ఉన్నకాడికి ఏశినం.. అన్ని పోయినయి.. ఎంజేత్తవో సారు.. మీ దయ
హరీశ్‌రావు: చేపిస్త.. చేపిస్త..తప్పకుండా సాయం చేపిస్త..
మహిళా రైతు: పంట పండుతది.. మంచిగా బతుకుతమనుకున్నం.. ఇంత పనైతదని అనుకోలేదు సారూ..
హరీశ్‌రావు: కరెంటు మంచిగచ్చె.. నీళ్లు మంచిగచ్చె.. గవర్నమెంట్ చేసేదంతా చేసినం..
మహిళా రైతు: ఇపుడు దేవుడు తీసుకపోయిండు.. ఇగ మీ చేతులనే ఉన్నది సారూ..
హరీశ్‌రావు: వ్యవసాయశాఖ వాళ్లకు చెప్పిన. మొత్తం రాసుకుంటరు. మీ అకౌంట్ నంబర్లు తీసుకుంటరు. వానకాలం పంటలోపు మీకు సాయం చేపిస్తం.దేశంలో ఎక్కడా లేని విధంగా సాయం చేపిస్తం. రైతుబంధు, నీళ్లు ఇచ్చి రైతులను కాపాడుకుంటున్నం.
మహిళా రైతు: మీరు అట్ల చేస్తున్నరనే సారూ.. మీ ఎంబడే ఉంటున్నం..
హరీశ్‌రావు: రూ.20కు యూనిట్ పెట్టి కరెంట్ కొంటున్నం. భవిష్యత్తులో ఒక నెల వానకాలం ముందుకు గుంజి నాట్లేసుకోవాలె. యాసంగిలో కూడా ఒక నెల ముందు నార్లు ఏస్కోవాలే.
మహిళా రైతు: సరే సార్.. మీరు ఎట్లచెపుతే అట్ల చేస్తం..
హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలని కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. గత నెలలో అకాల వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి, ఆర్థిక సాయం ప్రకటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదని చెప్పారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.