Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ర్టాన్ని కూడా అమ్మకానికి పెడుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం పదిలంగా ఉంటుందని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. ఓ టీవీ చానల్లో జరిగిన చర్చలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని అనేక అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసిన తర్వాత ఎంతమంది బయటికి వస్తారో, ఎంతమంది బీఆర్ఎస్లో చేరుతారో చూడాలని అన్నారు. ఈ రోజు సీట్లు అమ్ముకున్న వారు రేపు రాష్ర్టాన్ని అమ్ముకోరా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. ముఠా తగాదాలతో రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ‘మేము ఒకే లీడర్ కేసీఆర్ అని చెప్తాం. వాళ్లు చెప్పగలరా? అక్కడ సీఎంలు ఎక్కువ. పదవులపైనే వాళ్లకు శ్రద్ధ’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ద్వితీయ స్థానం కోసమే పోటీ పడుతున్నాయని అన్నారు.
2014లో తెలంగాణ ఇచ్చింది మేమే.. టీఆర్ఎస్ అవసరమా అని కాంగ్రెస్ ఎద్దేవా చేసిందని, ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని హరీశ్ చెప్పారు. 2018లో అనేక పార్టీలు కలిసి వచ్చినా, బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ఈసారి కూడా అదే జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉన్నదని, గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో మళ్లీ అధికారం కట్టబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని ఇప్పటికే బలీయమైన ఆర్థిక శక్తిగా మార్చామని, రాబోయే కాలంలో పెరుగబోయే సంపదను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చారని తెలిపారు. రైతుబంధు ప్రారంభించినప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ విజయవంతంగా 11 దఫాలుగా అందించామని గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్ బాగా పనిచేస్తున్నారని హరీశ్‌రావు కితాబిచ్చారు. సోషల్ మీడియాలో చూస్తే కర్ణాటక, తమిళనాడు ఇలా అనేక రాష్ర్టాల వారు ఇలాంటి ఐటీ మినిస్టర్ మాకు కూడా ఉంటే బాగుండు అని కామెంట్లు పెడుతున్నారని తెలిపారు. అనేక దేశాలు, అంతర్జాతీయ యూనివర్సిటీలు నిర్వహించే సెమినార్లకు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వాస్తున్నాయని గుర్తుచేశారు. ‘బాగా పనిచేస్తేనే కదా వాళ్లు పిలిచేది’ అని అన్నారు. ఆయన తన పనితీరుతో రాష్ట్ర ఇమేజ్ను, ప్రభుత్వ ఇమేజ్ను పెంచుతున్నారని కొనియాడారు.
బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ కలువవని హరీశ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన హైప్ పాలపొంగులాంటిదని సీఎం కేసీఆర్ చెప్పేవారని, ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రయత్నించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. ‘అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎన్నికల ముందే ఎందుకు చెప్తున్నారు?’ అని ప్రశ్నించారు.
నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలు కేంద్రంగా నడవాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని హరీశ్ చెప్పారు. పదవులు ఇచ్చి ముగ్గురు నలుగురిని ప్రోత్సహిస్తే గ్రూపు రాజకీయాలు, వెన్నుపోట్లు మొదలవుతాయని అన్నారు. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే ఎవరు అనేదానికన్నా ఎవరు సీఎం అయితే బాగుంటుందో, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే పదిలంగా ఉంటుందో ఓటర్లు ఆలోచిస్తారని తెలిపారు. మరోసారి సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.
సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చేవాటిని ఉచితాలు అనవద్దని హరీశ్‌రావు సూచించారు. రైతుబంధు, రైతుబీమా వంటివాటి వల్ల రైతులు ఆర్థికంగా బలపడ్డారని, ఆత్మహత్యలు ఆగిపోయాయని చెప్పారు. వ్యవసాయ రంగం బలోపేతం అయితే రైతులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు మొదలు రైస్‌మిల్లుల యజమానులు, బస్తాలు మోసే హమాలీల వరకు ఎంతోమందికి ఉపాధి దొరికిందని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ఉచితం కాదని.. చట్టమో, పోలీసులో చేయలేని పనిని ఈ పథకం చేసిచూపెట్టిందని అన్నారు. 18 ఏండ్లు నిండితేనే పథకం వర్తిస్తుందనే నిబంధన వల్ల ఓవైపు బాల్య వివాహాలు తగ్గాయని, మరోవైపు మహిళల్లో అక్షరాస్యత రేటు పెరిగిందని చెప్పారు.
మొదటి విడతలో 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ దఫా మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని హరీశ్ పేర్కొన్నారు. ఈసారి నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అయ్యాయయని, అయితే ఇందుకు కారణాలు ఉన్నాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడిందని, మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతున్నదన్నారు.