కరీంనగర్ : సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకుని తెలంగాణ పల్లెలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చర్లబుత్కూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పల్లె ప్రగతి(Palle Pragathi) దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటిని తీసుకొచ్చేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR)పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రామాలల్లో పారిశుధ్యం నిరంతరం కొనసాగించడానికి, చెత్తాచెదారం సేకరించడానికి, వాటిని తరలించడానికి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ను సమకూర్చారని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు.
పల్లె ప్రగతిలో కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చడం, వంగిపోయిన తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేయడంతో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తగ్గిందని అన్నారు. హరితహారం ద్వారా మొక్కలను పెంచామని వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంతో మండుటెండల్లో సైతం నీళ్లు మత్తడి దూకుతున్నాయని, భూమికి బరువయ్యేంత పంటలు పండుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి సందర్భంగా పారిశుధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, ఎంపీపీ టి.లక్ష్మయ్య, పాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచ్ డి రమణారెడ్డి, రుద్ర భారతి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.