హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో సొంతంగా మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్పీఈజెడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దార్శనికతో తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు. రైతు అనుకూల విధానాలతో పదిరెట్ల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. పంటకు అనుగుణంగా మిల్లింగ్ ఇండస్ట్రీ(Milling Industry)ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014 లో రాష్ట్రంలో 1,815 రైస్ మిల్లులు ఉండగా నేడు 2,574 కు పెరిగాయని తెలిపారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి తెలంగాణలో విసృత అవకాశాలున్నాయన్నారు. రూ.2వేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయడానికి ఆదేశించారని ఈ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
తెలంగాణ మిల్లింగ్ ఇండస్ట్రీలో విస్తృత అవకాశాలు..
ప్రపంచవ్యాప్తంగా వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని ఒడిసిపట్టడంలో తెలంగాణ ముందుంటుందని మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్ తో పాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక, తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న సటాకే, సైలో తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని మంత్రికి వివరించారు. గంటకు 20 నుంచి 1200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
బాయిల్డ్, రా రైస్ దేనికైనా అనుగుణంగా అత్యంత అధునాతన పద్దతుల ద్వారా వ్యర్థం, వ్యయం తగ్గేలా టెక్నాలజీ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా 100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి టేలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అందిస్తుందన్నారు.
ఈ జోన్లలో సాధారణ పెట్టుబడిదారులకు సైతం ఐదుసంవత్సరాల పాటు 2 రూపాయలకే యూనిట్ నాణ్యమైన కరెంట్, 75 శాతం వరకూ వడ్డీ మాపీ, మార్కెట్ ఫీజుల్లో 100 శాతం రాయితీలను అందిస్తుందన్నారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని, వీటిని ఆయా వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జీఎం రాజారెడ్డి, టీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్ కుమార్ గవార్, ప్రతినిధి సుష్మ, జపాన్ సటాకే కార్పొరేషన్ ప్రతినిధులు ఆర్కే బజాజ్, హెచ్. సతీష్ కుమార్, కె.విఠల్, కె.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.