కరీంనగర్ : సమైక్య పాలనలో ధ్వంసమైన కులవృత్తులను స్వయంపాలనలో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula ) అన్నారు. నీలి విప్లవం(Blue revolution) ద్వారా ముదిరాజ్లు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ ఎల్ఎండీ జలాశయంలోని గంగమ్మ దేవాలయం వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో శనివారం చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు .
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మన రాష్ట్రానికి వచ్చి ఆధునిక టెక్నాలజీతో విశ్వబ్రాహ్మణుల పొట్ట కొట్టారన్నారు. తెలంగాణ పాలనలో కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు, యాదవులకు గొర్రెలు, ముదిరాజ్ లకు ఉచితంగా చేపల పంపిణీ, రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వాల పాలనలో జలాశయాల్లో నీరు లేక వెలవెలబోయేవని, మత్స్య సంపద లేక ముదిరాజ్ (Mudiraj) లు కులవృత్తికి దూరమైన పరిస్థితులు ఉండేవని వెల్లడించారు. నీలి విప్లవం తీసుకువచ్చి ముదిరాజ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో రూ. 10.45 కోట్ల విలువ గల 12 . 35 కోట్ల చేప పిల్లలు విడుదల చేశామని వివరించారు. చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి(Export) చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ బి. గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు తదితరులు పాల్గొన్నారు.