BC Welfare | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రూ. లక్ష ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని, ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని తెలిపారు.
మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయని, వర్గాల వారిగా బీసీ-ఏ 2,66,001, బీసీ-బీ 1,85,136, బీసీ-డీ 65,310, ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం పరిశీలన కొనసాగుతుందన్నారు. ప్రతీ నెల 5వ తారీఖు వరకు వెరిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. 15వ తేదీన స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.