హైదరాబాద్: కేసీఆర్ సర్కారు బీసీ ఆత్మగౌరవాన్ని పెంచిందని, వెనుకబడ్డ కులాల్లో పుట్టడమే అదృష్టంగా భావించే పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే తపన సీఎంలో ఉందన్నారు. సర్కారు రూ.5500 కోట్ల మార్కెట్ విలువగల 82.30 ఎకరాలను 41 బీసీ కులాలకు కేటాయించిందన్నారు. ఇవాళ బీసీల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి రాష్ట్రస్థాయి రిజిస్టర్డ్ కుల సంఘాలతో బీసీ సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించింది.
మంత్రి గంగుల కమలాకర్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆత్మగౌరవ భవనాలకు సంబందించిన నిర్ధిష్ట కార్యాచరణను ఈ సందర్భంగా మంత్రి గంగుల ప్రకటించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో గొప్ప కార్యక్రమం చేపట్టిందని, బీసీలు సంఘటితంగా ఏకమై ఆత్మగౌరవ భవనాలను అద్భుతంగా నిర్మించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు వచ్చాయని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపాలన్నారు.