వరంగల్ : రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, చిల్లర చేష్టాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ, మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరకవేడు, వెంకటేశ్వరపల్లి లో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్రంలో కాలేశ్వరం(Kaleshwaram Project) లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుష్కలంగా లభించి పంటలు సంవృద్ధిగా పండుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారన్నారు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు దర్శనమిచ్చేవని, పంటలు ఎండిపోయేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు చేపట్టారని గుర్తు చేశారు.
పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ(Narendra Modi) సర్కారు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు , ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.