తెలంగాణలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన నిజామాబాద్ రూరల్ మండలం పాల్డా గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టాప్ 10 ఆదర్శ గ్రామాల్లో ఉన్న పాల్దా, పెంటకుర్దు, వెల్మల్, కుకునూరు, మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో ఉన్న కందకుర్తి గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదని, తెలంగాణలోని గ్రామాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాదని, దమ్ముంటే తెలంగాణలాంటి పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని సవాల్ విసిరారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు వచ్చిందా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల బోగస్ మాటలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు మహర్దశ వచ్చిందన్నారు. పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు.
పల్లె ప్రగతితో పచ్చగా పల్లెలు: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
పల్లె ప్రగతితో పల్లెలన్నీ పచ్చగా మారాయని, దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చే నాటికి గ్రామ పంచాయతీలకు కేవలం కేంద్ర అర్థిక సంఘం నిధులు మాత్రమే వచ్చేవని, ఆ నిధులు కేవలం పంచాయతీ నిర్వహణకు కూడా సరిపోయేవి కావన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సాగు, తాగునీరు, నిధులపై దృష్టి పెట్టారని తెలిపారు. గ్రామాలను బాగు చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా గ్రామాల రూపురేఖలే మారిపోయాయని, మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.