తొర్రూరు, ఆగస్టు 29 : కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైనట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో మంగళవారం ఆయన పామాయిల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి, కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తు తం తెలంగాణ ఆయిల్‌పామ్ సాగులో దేశంలో రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు.
2022-23లో రికార్డు స్థాయిలో 22,246 మంది రైతు లు 82,372 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు శ్రీకారం చుట్టారని, ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు 43 వేల ఎకరాల్లో మంజూరు ఇచ్చినట్టు తెలిపారు. సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్సీ అమలు చేయడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.