జనగామ, జనవరి 5 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ర్టాల నిధులు, ఉపాధి పనుల నిధుల మళ్లింపు వంటి అంశాలపై నిజాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల అధికారులతో హైదరాబాద్‌లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయించి చర్చించడానికి సిద్ధమా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. గురువారం జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం పెండింగ్‌లో పెట్టినా.. వాటితో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నదని చెప్పారు. రూ.150 కోట్ల ఈజీఎస్ నిధులను రైతు వేదికలు, కల్లాలకు ఖర్చు చేశారనే సాకుతో.. తెలంగాణకు రావాల్సిన రూ.11 వేల కోట్ల నిధులను 8 నెలలుగా కేంద్రం నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా.. సీఎం కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. అవార్డులు సాధించడంలో సత్తాచాటుతున్నదని చెప్పారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ర్టానికి అవార్డులు రావడంతోపాటు జాతీయ స్థాయిలో 4-స్టార్ రేటింగ్‌లో మొదటి మూడు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు వచ్చాయని, త్రీ స్టార్, టూ స్టార్ రేటింగ్స్‌లోనూ రాష్ర్టానికి చెందిన పల్లెలే మొదటి స్థానాల్లో నిలిచాయని గుర్తుచేశారు. అవార్డులు సాధించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఎర్రబెల్లి అభినందించారు. అచీవర్స్ త్రీ స్టార్ రేటింగ్‌లో సిద్దిపేట జిల్లా మొదటి, జగిత్యాల రెండో స్థానంలో నిలిచాయని అన్నారు. పెర్ఫార్మర్స్ 2 స్టార్ రేటింగ్‌లోనూ భద్రాద్రి కొత్తగూడెం మొదటి స్థానాన్ని సాధించడం తెలంగాణ గ్రామాల గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు.