హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి సంబంధించి రూ.374 కోట్లను ఆర్టీసీకి బదిలీచేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచగా, వైద్యారోగ్యశాఖకు రూ.298 కోట్లు విడుదలచేస్తూ రెండో సంతకం చేశారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం రెండో అంతస్థులో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్తుశాఖల మంత్రిగా విక్రమార్క గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సమ్మక-సారలమ్మ మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు మంజూరు చేయాలని గిరిజన సంక్షేమశాఖ ప్రతిపాదనను ఆమోదిస్తూ మరో సంతకం చేశారు. విద్యుత్తు సబ్సిడీలకు రూ.996 కోట్లు విడుదలచేస్తూ ఇంకో సంతకం చేశారు.
త్వరలోనే ఆరు గ్యారెంటీల అమలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా తొలుత రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండు గ్యారెంటీలకు నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, బీ ఐలయ్య, మట్ట రాగమయి, మల్రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్తుశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శులు శ్రీదేవి, కృష్ణ భాసర్, హరిత.. భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భట్టి సతీమణి మల్లు నందిని విక్రమార, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క దంపతులు గృహ ప్రవేశం చేశారు.
బుల్లెట్‌ప్రూఫ్ బాత్రూంలు, 150 గదులు ఉన్నాయా?
‘ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, 150 గదులు’ అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ నివాసం ఉన్నప్పుడు.. ఆ భవనంపై ఉత్తమ్ అనేక ఆరోపణలు చేశారు. ‘దేశంలో ప్రధాని నివాసం సహా ఏ ప్రజాప్రతినిధి అయినా లక్ష స్కేర్ ఫీట్ ఇంట్లో ఉంటున్నారా? రూ.500 కోట్లు విలువ చేసే భూమి మీద, రూ.60 కోట్ల ప్రజాధనంతో ఇల్లు కట్టుకున్నారా? బెడ్రూమ్, బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్‌తో నిర్మించుకోవడం ఏంటి? అందులో 150 గదులు ఉన్నాయట కదా? దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి?’ అంటూ మీడియా సాక్షిగానే ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు.
అయితే, అదే భవన్‌ను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదే భవన్లో ఇప్పుడు భట్టి ఉంటున్నారు కాబట్టి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు విక్రమార్కకు కూడా వర్తిస్తాయని పేర్కొంటున్నారు. దీనిపై భట్టి స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.