హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ‘నేను తెలంగాణ నుంచి వచ్చాను.. హైదరాబాద్ నడిగడ్డ నుంచి వచ్చాను.. లౌకికత్వానికి సిసలైన ప్రాంతం తెలంగాణ.. పేదింటి మైనారిటీ ఆడపిల్ల పెండ్లికి తెలంగాణలో షాదీముబారక్ పథకం ఉంది.. ఇక్కడ ఉందా? అని ఎంఐఎం నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఉత్తరప్రదేశ్‌లో ప్రశ్నించారు. త్వరలో యూపీలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజిద్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని పలు వేదికల మీద రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో ఉన్నది ఎంఐఎం ప్రభుత్వం కాదని, తమ పార్టీకి ఉన్నది కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలేనని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా మతతత్వ శక్తుల అరాచకాలు తమ రాష్ట్రంలో లేవని వివరించారు. విద్యార్థుల కోసం ప్రతి జిల్లాకో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. యూపీలో తాను కొంతకాలంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నానని, తనకెక్కడా ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కనిపించలేదని చెప్పారు. ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం పేరుతో రూ.1,00116 అందజేస్తున్నదని పేర్కొన్నారు. వృద్థులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ. 2016, రూ.3016 చొప్పున అందజేస్తున్నదని వెల్లడించారు. హైదరాబాదీలు అయినా, తెలంగాణ వాళ్లెవరైనా ఎవరికీ గులాంలు కారని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ గులాంగిరీ పార్టీలేనని ఎద్దేవా చేశారు.