జనగామ, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని నియంత్రించకపోతే మిలిటెంట్ ఉద్యమం చేయక తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జనగామలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు మద్యం మహమ్మారి భూతం వేషధారణతో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించి సుమారు 4 గంటల పాటు వందలాది మంది మహిళలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో బెల్ట్ షాపులను నిషేధించి ప్రజలను రక్షిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. బ్రాందీ, లిక్కర్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం నాయకులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనితతో ఫోన్లో మాట్లాడగా డిసెంబర్ నెలాఖరులోగా బెల్ట్ షాపులను అరికడతామంటూ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.