ఖైరతాబాద్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని కేబుల్, టెలికం, ఇంటర్నెట్ ఆపరేటర్లను విద్యుత్తు శాఖ దారుణంగా దెబ్బతీస్తున్నదని, విద్యుత్తు స్తంభాలకు అమర్చిన కేబుళ్లను అనధికారికంగా కత్తిరిస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నదని తెలంగాణ కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల సంక్షేమ సంఘం (టీజీసీఐటీ) రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్తు శాఖ తీరును ఎండగట్టారు. కేబుల్, ఇంటర్నెట్, టెలికామ్ సర్వీస్ ఆపరేటర్లు ఏటా జీఎస్టీ, లైసెన్సు ఫీజుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయలు చెల్లించడంతోపాటు టీజీఎస్పీడీసీఎల్కు భారీగా రుసుములు చెల్లించి విద్యుత్తు స్తంభాలను వినియోగించకునేందుకు చట్టబద్ధంగా అనుమతులు పొందుతున్నారని తెలిపారు. దీన్ని విస్మరించి విద్యుత్తుశాఖ సిబ్బంది కేబుల్ వైర్లను కత్తిరిస్తూ సేవలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవాధ్యక్షుడు శివరామకృష్ణ, మల్లేశ్, సత్యనారాయణ, మనోకుమార్, జైపాల్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.