హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజన పథకం(పీఎం పోషణ్) లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతున్నది. స్వీకరించే వారి సంఖ్య ఏటా క్రమంగా పడిపోతున్నది. ఏడాది వ్యవధిలోనే 1,90,842 (రెండు లక్షల) విద్యార్థులు తగ్గిపోయారు. సర్కార్ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గుతుండటం, విద్యార్థుల సంఖ్య పడిపోతుండటమే దీనికి ప్రధాన కారణం. 2026-27 విద్యాసంవత్సరంలో 1-8 తరగతుల్లో 10,55,756 విద్యార్థులకు మధ్యాహ్న భో జనం సమకూర్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
2025-26 విద్యాసంవత్సరంలో 12, 46,598 విద్యార్థులకు ఆమోదం తెలుపగా, ఈసారి ఏకంగా రూ. 1.90లక్షల మందికి కోతపడింది. 2024-25లో 12,99,425 లబ్ధిదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం పోషణ్ ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డు(పీఏబీ) సమావేశాన్ని మంగళవారం వర్చువల్‌గా నిర్వహించారు. ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ అధికారులు సమీక్షించగా, రాష్ట్రం నుంచి అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను స మావేశం ముందుంచారు. మధ్యాహ్న భోజన పథకం బడ్జెట్ తగ్గింది.
నిరుటితో పోల్చితే రూ. 36కోట్లు కోతపడింది. 2025-26 విద్యాసంవత్సరంలో రూ. 307.86కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది రూ. 271.34కోట్లకే ఆమోదం లభించింది. కేంద్రం 1-8 తరగతుల్లోని విద్యార్థులకే ఈ పథకం ద్వారా నిధులు సమకూరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 9,10 తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వారంలో మూడు రో జుల్లో కోడిగుడ్లు/అరటిపండు, మరో మూడు రోజులు రాగిజావ అందజేస్తున్నది. రాష్ట్రంలో 8,108 కిచెన్ కమ్ స్టోర్స్ ఉండగా వీటి మరమ్మతులకు నిధులు ప్రతిపాదించారు.
