హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతినెలా ఐదో తారీఖు లోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జీఎన్ఆర్ఈజీఏ రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తిచేశారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న 21 నెలల ఎంపీడీవో కార్యాలయాల అడ్మినిస్ట్రేటివ్ బిల్లులు వెంటనే విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సచివాలయంలో సీతక్కకు విన్నవించారు.
సమావేశం తర్వాత జేఏసీ నేతలు మాట్లాడుతూ దసరాకు ముందు జీతాలు విడుదల చేయాలని మంత్రి సీతక్క ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశించినట్టు తెలిపారు. అడ్మిన్‌ను బిల్లుల విడుదలపైనా దసరా తర్వాత స్పందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో జీఎన్ఆర్ఈజీఏ రాష్ట్ర జేఏసీ చైర్మన్ లింగయ్య, కో-చైర్మన్లు విజయ్‌కుమార్, మోహన్‌రావు, వెంకట్రామిరెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.