వరంగల్ చౌరస్తా, జూలై 18: రోగులకు వైద్యసేవలు అందించడంలో అలసత్వాన్ని ప్రదర్శించి విధులకు ఆలస్యంగా హాజరైన వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలుగురికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మెమోలు జారీ చేశారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరుకావడం లేదని ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘వైద్యుల కోసం రోగుల పడిగాపులు’ కథనానికి వైద్యాధికారులు స్పందించారు.
న్యూరాలజీ విభాగం అసిస్టెంట్ వినయ్‌కుమార్, డాక్టర్ గౌతమ్, డాక్టర్ మానస, డాక్టర్ నవీన్‌కు మెమోలు జారీ చేస్తూ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హాస్పిటల్లో అన్ని విభాగాల పరిస్థితి ఇలాగే ఉన్నా ఒక్క విభాగానికి చెందిన వైద్యులకే మెమోలు జారీ చేయడాన్ని పలువురు వైద్యులు తప్పుబడుతున్నారు.