హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తుందని.. అధికారంలోకి వచ్చాక మెట్రో మూడో విడతను చేపడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు మండలిలో ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి.. కేంద్రం పగబట్టినా, సహకరించకపోయినా మెట్రోను దశలవారీగా విస్తరిస్తున్నామని వెల్లడించారు. 69 కిలోమీటర్ల మెట్రో మొదటి విడతలో కేంద్రం ఇంకా రూ. 254 కోట్లు బాకీ ఉన్నదని తెలిపారు. రెండో దశ మెట్రోలో భాగంగా 62 కి.మీ చేపడుతున్నామని, దీనిని రెండు భాగాలు చేశామని వివరించారు. 31 కిలోమీటర్లతో కూడిన ఎయిర్పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని, దీనిని రూ.6,200 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, మూడేండ్లలో పూర్త్తిచేస్తామన్నారు. రెండో విడతలో బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రానికి పంపినా, బడ్జెట్లో నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కలుద్దామన్నా కేంద్ర మం త్రులు సమయం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం బెంగళూరు రెండో దశ మెట్రోకు రూ.41 వేల కోట్లు, చెన్నై మెట్రో రెండో విడతకు రూ.58 వేల కోట్లు ఇస్తున్నదని, లక్నో, అలహాబాద్, ఆగ్రా, కాన్పూర్, గాంధీనగర్ మెట్రోలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నదని గుర్తు చేస్తూ.. తెలంగాణకు కేటాయింపులు లేకపోవటం పగ కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర సర్కారుపై అక్కసు
బీఆర్ఎస్ సర్కారుకు మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే మన మెట్రోను పక్కనబెట్టారని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రం చిన్నచూపు చూసినా, మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాకే మెట్రో చార్జీలు పెంచాలని ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్కు షరతు విధించి, ఆర్టీసీ చార్జీలకు తగ్గట్టు ఉండేలా టికెట్ ధరలను నియంత్రిస్తున్నట్టు వెల్లడించారు. మెట్రో మూడో దశలో రామోజీ ఫిలిం సిటీ, మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.
బీపాస్ వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు
21 రోజుల్లో భవన నిర్మాణం, లే అవుట్లకు అనుమతులిచ్చే టీస్బీపాస్ వ్యవస్థ దేశంలో మరే రాష్ట్రంలో లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం టీఎస్‌బీపాస్‌ను మెచ్చుకొన్నారని గుర్తు చేశారు. రెగ్యులరైజేషన్‌పై ఎమ్మెల్సీలు డీ రాజేశ్వర్‌రావు, కల్వకుంట్ల కవిత, తానిపర్తి భానుప్రసాదరావు, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. బీఆర్ఎస్ కింద 2,12,381 దరఖాస్తులు వచ్చాయని, దీనిపై హైకోర్టులో విచారణ సాగుతున్నదని తెలిపారు.
కేంద్రంపై కోర్టుకు వెళ్తాం: తలసాని
రాష్ర్టానికి కేంద్రం నుంచి వచ్చే రాబడి విషయంలో వెనక్కి తగ్గేది లేదని, కేంద్రం పై పోరాటం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండలిలో ప్రకటించారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ర్టానికి జీఎస్టీ పరిహార చెల్లింపులపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్రం నుంచి రూ.2,433 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని తెలిపారు.
గురుకుల విద్యార్థులు రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు: గంగుల
రాష్ట్రంలో గురుకుల విద్య ద్వారా నాటిన నేటి విత్తనాలు.. రేపటి విద్యా వృక్షాలవుతాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. వారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతారని చెప్పారు. ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి.. బీఆర్ఎస్ పాలనలో స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజుల కింద రూ.11వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.
దివ్యాంగులకు ఉపాధి: కొప్పుల
దివ్యాంగుల సంక్షేమానికి ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేస్తున్నామని, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. రూ.1,907 కోట్లతో 5.11 లక్షల లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ల నియామకంపై ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జీవన్‌రెడ్డి, దివ్యాంగుల సంక్షేమంపై ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానమిచ్చారు. డిప్యూటీ వార్డెన్లను నియమించే ఆలోచన లేదన్నారు.
తలసాని, జీవన్‌రెడ్డి మధ్య సంవాదం
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మధ్య సంవాదం చోటుచేసుకొన్నది. పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకం అందజేయాలన్న జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను తలసాని తిప్పికొట్టారు. ఇప్పటివరకు రూ.365 కోట్లను ఇన్సెంటివ్ రూపంలో అందించామని తెలిపారు. రూ.245 కోట్లతో శంషాబాద్‌లో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. డెయిరీలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించటంతో వివాదం సద్దుమణిగింది.