హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా బాయిలకాడ మోటర్లు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. కేంద్రం ఒత్త్తిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో మోటర్లకు మీటర్లు బిగించింది. ఇక ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2023 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు.