హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో వివాదాలకు కేరాఫ్‌గా మారిన మెస్ కాంట్రాక్టర్‌ను మార్చేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థుల డిమాండ్ల మేరకు కాంట్రాక్టర్‌ను తొలగించేందుకు ఆర్జీయూకేటీ అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. హరే రామ.. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అక్షయపాత్రకు మెస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. శాకాహారాన్ని అక్షయపాత్ర.. మాంసాహారాన్ని స్థానికంగా ఉండే స్వయం సహాయక బృందాల చేత వండించి విద్యార్థులకు అందజేయాలని యోచిస్తున్నారు.
ఏడాది కాలంగా ఆర్జీయూకేటీలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ విద్యాసంస్థకు మాయని మచ్చను తెచ్చిపెట్టాయి. వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూడటం.. విద్యార్థులు అస్వస్థతకు గురవడం తంతుగా జరుగుతున్నది. నిరుడు విద్యార్థులు మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్న అక్షయపాత్రకు మెస్ కాంట్రాక్ట్‌ను అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, వారంలో రెండుసార్లు మాంసాహారాన్ని వండే బాధ్యతలను స్థానిక స్వయం సహాయక బృందాలకు అప్పగించనున్నారు. దీనిపై, అక్షయపాత్ర వర్గాలు సానుకూలత వ్యక్తం చేశారని, ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకొంటామని వర్సిటీ ఉన్నతాధికారి తెలిపారు.