Self Help Groups | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఒకే గొడుగు కిందికి గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలను తీసుకురావాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతున్నది. పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా గ్రూపులను సెర్ప్ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మెప్మా, సెర్ప్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వేర్వేరుగా నిధులు విడుదలవుతున్నాయి. పైగా రెండురకాల గ్రూపులు వేర్వేరు శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
పట్టణాల్లోని మెప్మా రిసోర్సు పర్సన్లకు నెలకు రూ.6,000 వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్ ఆర్పీలకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాల విలీనంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. విలీన అంశంపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల గ్రూపులు కలిపి దాదాపు 70 వేల ఉన్నాయి. సభ్యులు 7 లక్షల మంది ఉన్నారు. అందులో మెప్మా ఆధ్వర్యంలో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారు.