హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలోని ఉద్యోగులను కొందరు కరెంట్ వినియోగదారులు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న తీరును తాము ఖండిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గురువారం ప్రకటించింది. నగరంలోని ఆటోనగర్ సెక్షన్ పరిధిలో వినియోగదారులు తమ ఇంట్లో కరెంటు లేదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందిన వెంటనే స్థానిక లైన్మెన్ వారి ఇంటికెళ్లి సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కరించినందున ట్వీట్‌ను డిలీట్ చేయాలని, లేదంటే కనీసం సమస్య పరిష్కారమైందని పోస్టు అయినా చేయాలని లైన్మెన్ కోరాడు. కానీ ఇదే సమస్యపై ఇతర వ్యక్తులు ట్వీట్ డిలీట్ చేయాలని ఒత్తిడి తెస్తే.. వేధిస్తున్నారని మా కార్మికునిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వీ వెంకటేశ్వర్లు, బీ సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు కార్మికులకు పని ఒత్తిడి ఉంటుందని, ఇలాంటి తప్పుడు ప్రచారం వారిని మానసికంగా బాధిస్తుందని తెలిపారు. మెరుగైన విద్యుత్ సేవల కోసం తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇదిలా ఉంటే తమ ఇంట్లో కరెంట్ పోవడం అనేది విద్యుత్ శాఖ తప్పిదమేనని, సమస్యను పరిష్కరించమని ట్వీట్ చేస్తే వేధింపులవుతాయా? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
సమస్యను పరిష్కారమయిన తరువాత ట్వీట్‌ను డిలీట్ చేయాలని వినియోగదారులపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. ఇతరులకు ఇబ్బందిలేనంత వరకు సోషల్‌మీడియాలో ట్వీట్ డిలీట్ చేయాలనే హక్కు ఎవరికీ లేదని వినియోగదారులు సూచిస్తున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనేదే మా ఉద్దేశ్యమని వారు చెప్పడం గమనార్హం.