వెంగళరావునగర్, అక్టోబర్ 14: గాలిని నీరుగా మార్చే మేఘదూత్ ఎయిర్‌వాటర్ జనరేటర్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చింది. మైత్రీ ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు ఎం రామకృష్ణ వెంగళరావునగరంలోని తమ కార్యాలయంలో శుక్రవారం పలు ఎయిర్‌వాటర్ జనరేటర్ మాడల్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్ విద్యుత్తు ఖర్చుతో పర్యావరణ అనుకూలమైన స్వచ్ఛమైన లీటరు నీటిని తయారు చేయవచ్చని చెప్పారు. గాలిలోని తేమను నీరుగా మార్చే ప్రక్రియ నాలుగేండ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చిందన్నారు.
అయితే తొలిసారిగా గృహావసరాలకోసం తమ సంస్థ ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ జనరేటర్ ద్వారా గాలిలో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ తేమ ఉన్నా, గాలిలో 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా నీరు తయారుచేయవచ్చని వివరించారు. ఒక్కో మాడల్ రోజుకు 30 నుంచి ఐదువేల లీటర్ల వరకు స్వచ్ఛమైన నీటిని తయారు చేయగలవని చెప్పారు. విద్యుత్తు ద్వారా మాత్రమే కాకుండా ఇన్వర్టర్, పవన విద్యుత్తు, సౌర విద్యుత్తుతో కూడా తమ జనరేటర్లు పనిచేస్తాయని చెప్పారు. అతి తక్కువ ధరతో మధ్య తరగతి ప్రజలకు ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చామన్నారు.