Manipur | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇది ఆదివారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చేరుకోనున్నది. అక్కడి నుంచి తెలంగాణ బిడ్డలు తరలింపు ఏర్పాట్లను సీఎం కేసీఆరే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు దగ్గర్నుంచి.. బాధితులకు మంచి నీరు, భోజనం, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే మణిపూర్ సీఎస్‌తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. మన విద్యార్థులు, పౌరులను సురక్షితంగా పంపించే విషయమై చర్చించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీజీపీ అంజనీకుమార్ మణిపూర్‌లో చిక్కుకున్న మన వాళ్ల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 7901643283ను, dgp@tspolice.gov.in మెయిల్‌ను అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్‌లైన్‌కు డీఐజీ సుమతిని ఇంచార్జిగా నియమించారు. ఆమె బాధితులకు ధైర్యం చెప్తూ, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నారు.
హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్న బాధితులు
ఆందోళనలతో మణిపూర్ అట్టుడుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు. తెలంగాణకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదువుతున్నట్టు సమాచారం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే తెలంగాణ పౌరులు కూడా చిక్కుకున్నట్టు తెలిసింది. సమన్వయం చేసుకుంటున్నాం: డీజీపీ
మనవారిని సురక్షితంగా రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కొందరు తెలుగు విద్యార్థులు హాస్టళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఒక్క ఇంఫాల్ ఎన్ఐటీలోనే సుమారు 150 మంది తెలుగు విద్యార్థులున్నట్టు సమాచారం. వివిధ ప్రాంతాల్లో ఉన్న కొందరు తెలుగువారు తిండికి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. అక్కడి పోలీసులు 144 సెక్షన్ విధించి.. అడుగడుగునా జామర్లు పెట్టడంతో ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. వచ్చే ఐదు రోజుల పాటు ఫోన్లు, ఇంటర్నెట్పై ఈ నిషేధం కొనసాగించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొన్ని గంటల్లోనే 45 కాల్స్..
హెల్ప్‌లైన్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 45 కాల్స్ వచ్చినట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. వీరిలో విద్యార్థులు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు, చిరువ్యాపారులు ఉన్నారని పేర్కొన్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని, బాధితులకు మన పోలీసులు ధైర్యం చెప్పారని వివరించారు. వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారో వివరాలు తెలుసుకొని, స్థానిక పోలీసులతో మాట్లాడి తాగునీరు, ఆహారం ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్స్ చేసిన వారిలో తెలంగాణ విద్యార్థులే కాకుండా.. ఏపీకి చెందిన వారు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు
రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు మణిపూర్ ప్రభుత్వం శనివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన సమావేశం శాంతి, సుస్థిరతల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో సీపీఐ, నాగా పీపుల్స్ ఫ్రంట్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీలు పాల్గొన్నాయి.
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్
మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా ఇండ్లకు చేర్చే ఏర్పాట్లను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఎలాంటి కష్టం కలుగకుండా.. రాష్ర్టానికి తీసుకొచ్చేలా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక విమానాన్ని పంపించి.. మన వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేశారు. బాధిత పౌరులు ఎక్కువ సంఖ్యలో ఉంటే మరోసారి విమానాన్ని మణిపూర్ పంపేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.