హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దక్షిణకొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ తెలంగాణలో తమ వాహనాల మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు ఆసక్తి వ్యక్తంచేసింది. పలు కొరియన్ కంపెనీలు వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తంచేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం తమ అమెరికా పర్యటన ముగించుకొని సోమవారం దక్షిణ కొరియాకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.
దీంతోపాటు వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పారులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో యాంగాన్ చైర్మన్ కిహక్ సుంగ్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయాంగ్ సహా 25 భారీ జౌళి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, వరంగల్ టెక్స్టైల్ పార్తోపాటు తెలంగాణలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న సానుకూలతలను సీఎం వివరించగా.. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియాలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కుజాయున్ బృందంతో సీఎం బృందం చర్చలు జరిపింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందం మంగళవారం సియోల్‌లో పర్యటించనున్నది. బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.