హైదరాబాద్, జూన్ 22( నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు మరింత ముదిరింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ వివాదంపై పరిశీలకుణ్ని నియమించినప్పటికీ, సంతృప్తిచెందని మంత్రి కొండా వ్యతిరేక వర్గీయులు పంచాయితీని కాంగ్రెస్ అధిష్ఠానం ముందుపెట్టారు. కొండా దంపతులు కావాలో? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బతకాలో తేల్చుకోవాలని అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. మంత్రి కొండా దంపతుల వ్యతిరేక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కే నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు మీనాక్షిని కలిసిన వారిలో ఉన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు వ్యవహారశైలిపై ఆమెకు ఫిర్యాదు చేశారు. కొండా మురళి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని, తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని గ్రూపులు కడుతున్నారని, అధికారుల నియామకాల్లో కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పార్టీకి నష్టం కలుగకూడదని, ప్రతిపక్షాలకు అనవసర అవకాశం కల్పించకూడదని తాము ఓపిక పడుతుంటే కొండా దంపతులు ఒంటెత్తు విధానాలతో తమపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారని వివరించినట్టు తెలిసింది.
వరంగల్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కొండా దంపతుల వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయించినట్టు తెలిసింది. వరంగల్ జిల్లాతో సంబంధం లేని ముగ్గురు సీనియర్ సభ్యులతో ఒకటి రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. వరంగల్ కాంగ్రెస్ కల్లోలంపై పీసీసీతోపాటు మంత్రి దంపతులతో కూడా మాట్లాడాలని నిర్ణయించినట్టు సమాచారం.