కోల్సిటీ, ఏప్రిల్ 19: ‘నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ కేసీఆర్కు మాత్రం వీరాభిమానిని. ఆయన ఎక్కడ సభ పెట్టినా సార్ స్పీచ్ వినడానికైనా ఆ మీటింగ్కు వెళ్తా. అది ఎక్కడైనా ఉండని, ఏ టైంకు అయినా ఉండని, తప్పకుండ పొద్దుగాలనే లేచి మీటింగ్కు పోతుంట’ అని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన మేడిపల్లి సత్యనారాయణ శనివారం ‘నమస్తే తెలంగాణ’తో తన మనోగతాన్ని పంచుకున్నాడు.
ఆ వివరాల్లో ఆయన మాటల్లోనే… నేను మొదట్నుంచీ కేసీఆర్కు వీరాభిమానిని. అప్పట్ల సింగరేణిలో నౌకరి చేసేటప్పుడు ప్రత్యే క తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతున్నది. కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా, నేను మాత్రం ఒకరోజు నాకా (మస్టర్) పోయినా పర్వాలేదు అనుకొని డ్యూటీ ఎగ్గొట్టి మరీ మీటింగ్కే పోయేటోన్ని.
ఇంట్లో వాళ్లు మీటింగ్కు వెళ్తే ఏమొచ్చింది? అనేటోళ్లు. ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మనం ఇంట్ల కూసుంటే బాగుండదు అని సర్దిచెప్పేవాడిని. పొద్దుగాల లేచి నా సొంత ఖర్చుల తో బస్సు ఎక్కేవాడిని. మీటింగ్ దూర ప్రాంతంలో ఉంటే రైలు కూడా ఎక్కి మీటింగ్కు పోయి వచ్చిన రోజులున్నవి. ఎందుకో తెల్వదు గానీ, కేసీఆర్ స్పీచ్, ఆయన మాటల తూటాలు వినడానికైనా, మీటింగ్కు తప్పకుండా పోయేటోన్ని.