హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM Abhim) నిధులను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. ప్రజారోగ్యంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2021లో పీఎం అభిమ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకంలో రాష్ట్ర వాటా కింద 40%, కేంద్ర వాటాగా 60% నిధులను కేటాయించాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్య శాఖలో ప్రజలకు అందుతున్న చికిత్సల్లో ఉన్న లోటుపాట్లను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం… రాష్ర్టాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వచ్చే నిధులను మందుల కొనుగోలుతోపాటు సివిల్‌వర్క్స్‌కు వినియోగించాల్సి ఉంటుంది. డబ్బులతో ముడిపడిన ఈ స్కీమ్‌లో కొంతమంది అధికారులు తమ కమీషన్ ఫిక్స్ చేస్తేనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని మెలిక పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఎం అభిమ్ కింద రాష్ర్టానికి కేంద్రం నుంచి ప్రతి క్వార్టర్‌కు (మూడు నెలలకు ఒకసారి) మందుల కొనుగోలుకు రూ.30 కోట్లు, సివిల్‌వర్క్స్‌కు రూ.50 కోట్లు రావాల్సి ఉంటుంది.
అయితే తొలి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి)కు సంబంధించి నిధులు కేంద్రం నుంచి రాగా, తరువాతి రెండు క్వార్టర్లకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపలేదని తెలిసింది. దీంతో రాష్ర్టానికి రావాల్సిన రూ.160 కోట్ల నిధుల మంజూరులో తీవ్ర జాప్యం నెలకొన్నది. ఈ విషయంలో తమ పర్సంటేజీని ఫిక్స్ చేస్తేనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని అధికారులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరి ద్వారా చక్కదిద్దాలనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. అధికారుల కొర్రీలతో మందులు సైప్లె చేసిన ఏజెన్సీలు, సివిల్‌వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఫ్యామిలీహెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో ఈ బిల్లుల ప్రక్రియ జరగాల్సి ఉండగా.. ఎందుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపడం లేదనేది అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపి రాష్ర్టానికి రావాల్సిన నిధుల విషయంలో చొరవ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.