వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 17: ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలు నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ హెల్త్ కేర్ రిఫా ర్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) వర ంగల్ విభాగం సభ్యులు, కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు మండిపడ్డారు. ఈనెల 19న ఆర్ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని ఆయన కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం కేఎంసీ ప్రధాన గేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో కోదండరాం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రీయత, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్నారంటూ కోదండరాంపై మండిపడ్డారు. ఇప్పటికైనా కోదండరాం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.