కురవి, మార్చి 2: కిడ్నీ మార్పిడి అంశంపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. ‘నమ్మించి కిడ్నీ తీసుకున్నారు’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలోని ఐసీయూలో ఉన్న బాధితుడు ధరావత్ చిట్టిబాబును ఆదివారం డీఎంహెచ్వో డాక్టర్ మురళీధర్ కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు గుర్తించారు. ఏడాదిన్నర క్రితం నల్లెల్ల గాజతండాకు చెందిన ధరావత్ చంద్రకు చిట్టిబాబు కిడ్నీ ఇచ్చినట్టు డీఎంహెచ్వో తెలిపారు.
కొన్ని రోజులుగా చిట్టిబాబు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించారని, డబ్బులు లేకపోవడంతో జిల్లా జనరల్ దవాఖానకు తరలించినట్టు చెప్పారు. ఇదే విషయమై కురవి పోలీస్ స్టేషన్కు వెళ్లి సమగ్ర వివరాలు సేకరించినట్టు తెలిపారు. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలో 2023 అక్టోబర్ 18న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. చిట్టిబాబు, చంద్ర కార్పొరేట్ దవాఖానలో మూడు నెలలపాటు చికిత్స పొందారని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో చిట్టిబాబు ఆరోగ్యం క్షీణించి ఫిట్స్ వచ్చాయని, అందుకోసం కుటుంబసభ్యులు మహబూబాబాద్ దవాఖానలో చేర్పించినట్టు చెప్పారు.