హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం వరద బాధిత ముంపు ప్రాంతాల డీఎంహెచ్వోలు, డాక్టర్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలని చెప్పారు.
హెల్త్ క్యాంపుల్లో అందుబాటులో ఉండి, బాధితులకు చికిత్స అందిస్తూ, పరీక్షలు చేస్తూ అవసరమైన మందులు అందజేయాలని సూచించారు. డీపీహెచ్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, డీఎంఈ రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహించాలన్నారు. హెల్త్ క్యాంపులు తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి ఆదేశాలతో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు డీఎంఈ రమేశ్ రెడ్డిని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు డీపీహెచ్ శ్రీనివాసరావును నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కరోజే 10,886 మందికి వైద్యం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో వైద్యాధికారులు ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13 నుంచే వైద్య శిబిరాల ఏర్పాటు ప్రారంభం కాగా, నేటికీ కొనసాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 164 చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయగా, మొత్తంగా 10,886 మందికి వైద్యం అందించారు.