ట్రిబ్ వ్యవహారమే ఆరోపణలకు ఊతం
ట్రిబ్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. టీజీటీ, పీజీటీ, పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటిరోజే ఆయా పోస్టులకు ఎంపికైన 1ః1 అభ్యర్థుల జాబితాను ట్రిబ్ ప్రకటించింది. కానీ జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన జాబితాను సర్టిఫికెట్ వెరిఫికేషన్, డెమోలను తీసుకున్న దాదాపు వారం పది రోజుల అనంతరం ప్రకటించింది. ఈ జాప్యమే పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందనే ప్రచారానికి ఊతమిస్తున్నది.
Gurukula Recruitment | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో బ్రోకర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు. గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులను ఇప్పిస్తామంటూ పలువురు బ్రోకర్లు అభ్యర్థులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల వరకు బేరసారాలు నడుస్తున్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవల పలువురు అభ్యర్థులు ఏకంగా ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ కలిపి మొత్తం 2,876 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) చర్యలు చేపట్టింది. ఈ మల్టీ జోనల్ పోస్టులకు రాత పరీక్షతోపాటు డెమోలు నిర్వహించింది.
డెమోకు 25 మార్కులు కేటాయించడంతో కొందరు బ్రోకర్లు అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1ః2 జాబితాలో ఉన్న అభ్యర్థులతో బేరసారాలకు దిగారని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాత పరీక్షలో తక్కువ మార్కులొచ్చిన అభ్యర్థులను గుర్తించి, వారితో బేరసారాలు నడిపి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు పరీక్ష రాసినవారు ఆరోపిస్తున్నారు.
భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినవారికి డెమో మార్కులు అధికంగా వేయించి తుది జాబితాలో ఎంపికయ్యేలా చేస్తామంటూ ఆశ చూపుతున్నారని వారు అంటున్నారు. డెమో మార్కుల కేటాయింపులో అక్రమాల వల్లే రాతపరీక్షలో మంచి మార్కులొచ్చినవారికి కూడా తుది జాబితాలో చోటు దక్కలేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాతపరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద నిరసనకు దిగడం గమనార్హం.
దీనిపై ప్రజాభవన్ ప్రజావాణిలో ఇప్పటికే నాలుగుసార్లు ఫిర్యాదు చేశామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజావాణిలో మొదటిసారి దరఖాస్తును అందజేసినప్పుడు అక్నాలెడ్జ్మెంట్తోపాటు, దరఖాస్తును స్వీకరించినట్టు మొబైల్‌కు మెస్సేజ్ వచ్చిందని, కానీ ఆ తరువాత దరఖాస్తు అందజేస్తే అటువంటి మెస్సేజ్‌లు కూడా రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, డెమోలను మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలోనే సబ్జెక్టుల వారీగా, మల్టీజోనల్ స్థాయిలో ఉన్న ఖాళీలు, జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్ తదితర కోటా కింద కేటాయించిన పోస్టుల వివరాలన్నీ ట్రిబ్ స్పష్టంగా పేర్కొన్నది. అయితే, దానిని అమలు చేసిందో, లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు థియరీ మార్కులను కూడా ప్రకటించలేదు. రాతపరీక్షకు సంబంధించిన తుది కీని మాత్రమే విడుదల చేసింది. రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులు, డెమో మార్కుల జాబితా ఊసేలేదు. నేరుగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల 1ః1 జాబితాను ప్రకటించింది. అదీ సదరు అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను మాత్రమే వెల్లడించింది. దీంతో గురుకుల అభ్యర్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా డెమో నిర్వహించినప్పుడు సదరు అభ్యర్థులకు చాక్‌పీస్, బ్లాక్‌బోర్డును ఏర్పాటుచేయాల్సి ఉండగా, ట్రిబ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్తున్నారు. సబ్జెక్టులవారీగా అభ్యర్థులు ఎంచుకున్న టాపిక్తోపాటు, ట్రిబ్ సైతం ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఒక టాపిక్‌ను ఇచ్చి అభ్యర్థి టీచింగ్ నైపుణ్యం, విషయ పరిజ్ఞానం తదితర అంశాలను పరిశీలించి మార్కులు వేస్తుంది. కానీ, జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన డెమోలను పూర్తిగా మౌఖికంగా నిర్వహించడం గమనార్హం. అభ్యర్థులకు చాక్‌పీస్, బోర్డు ఇవ్వలేదని, కేవలం సబ్జెక్టులకు సంబంధించి మౌఖికంగా ప్రశ్నలు అడిగారని, అది కూడా రెండు నిమిషాలకు మించి సమయం ఇవ్వలేదని 1ః2 జాబితాలోని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం పోస్టులకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నా మైక్రోబయోలజీ, బయోటెక్నాలజీ తదితర పోస్టులకు సంబంధించి పలువురు అభ్యర్థులను డెమోలకు కూడా ఆహ్వానించలేదు. దీంతో వారు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ట్రిబ్ ప్రతి అంశంలోనూ గోప్యత పాటిస్తుండటంతో అభ్యర్థుల్లో అనుమానాలు, అపోహలు పెరుగుతున్నాయి.
ట్రిబ్ గోప్యత పాటిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలువురు పీడీ, పీజీటీ, జేఎల్, డీఎల్ అభ్యర్థులు సమాచారహక్కు చట్టం కింద ట్రిబ్‌కు దరఖాస్తు పెట్టారు. కటాఫ్ మార్కుల జాబితాను కోరుతూ అప్పిలేట్ చేసుకున్నారు. గత నెల 15న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ట్రిబ్ సదరు దరఖాస్తుదారుడికి సమాచారాన్ని ఇవ్వకపోవడం గమనార్హం.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్పీఎస్సీ, ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు తాము చేపట్టిన నియామకాలకు సంబంధించి పూర్తిగా పాదర్శకతను పాటిస్తున్నాయి. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, హాల్‌టికెట్ నెంబర్లను సైతం తమ తమ సైట్లలో బహిరంగానే ప్రదర్శిస్తున్నాయి. కానీ, ట్రిబ్ మాత్రం రిజల్ట్ ప్రకటించి 15 రోజులు గడుస్తున్నా ఈ విషయంలో గోప్యత పాటిస్తుండటం అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు అవకాశమిస్తున్నది.
బ్యాక్లాగ్ భర్తీ చేయాలని నిరుద్యోగి దీక్ష
కల్లూరు, మార్చి 14 : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తుమ్మల జయరాజు తన ఇంటి వద్ద గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 2023లో గురుకుల పోస్టుకు పరీక్ష రాసి 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూకు వెళ్లినట్టు తెలిపారు. తనకంటే ముందున్న అభ్యర్థి పీజీటీ, జేఎల్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడంతో ఆయా పోస్టులు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తంచేశారు.
ఒకే అభ్యర్థి మూడు పోస్టులకు ఎంపిక కావడంతో బ్యాక్‌లాక్ పోస్టులు మిగిలిపోయి తనలాంటి వారికి అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 9,210 పోస్టులకు ప్రభుత్వం అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానించగా.. ఇందులో నాలుగు వేల పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయని, వెంటనే వాటిని భర్తీ చేసి తనలాంటి వారికి న్యాయం చేయాలని కోరారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ హైదరాబాద్‌లో ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా తాను కూడా రిలే దీక్ష చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
స్పందించని సర్కార్
గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు అనేక అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తంచేస్తున్నా, ఆందోళనకు దిగుతున్నా ట్రిబ్ పట్టించుకోవడం లేదు. ట్రిబ్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తున్నది. అభ్యర్థుల అనుమానాలు, విజ్ఞాపనలకు ఏవిధమైన జవాబు ఇవ్వడం లేదు. సందేహాలను నివృత్తి చేసేవిధంగా ట్రిబ్ వ్యవహరించడం లేదు. పోస్టులు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నా, రీలిక్విష్‌మెంట్ అంశం తేల్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే త్వరలోనే వేలాదిగా తరలివచ్చి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.