Medaram Jatara | వరంగల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు ఆదివాసీ కోయగిరిజన సమాజం తమ ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు మేడారం పయనం అవుతున్నది. బుధవారం సాయంత్రం మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతో మహాజాతర ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది. గురువారం సా యంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహాఘట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రేమికులు తరలివస్తారు.
మేడారం మహాజాతర నిర్వహణకు ట్రా ఫిక్ నియంత్రణే ప్రధాన సవాల్. మేడారం చేరుకోవడానికి హనుమకొండ జిల్లా ము లుగు రోడ్డు నుంచి ఏటూరునాగారం వయా తాడ్వాయి మార్గమే ప్రధానమైంది. ఈ మార్గంలో ఒక్క వాహనం ఆగినా వేలాది వా హనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతాయి. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించారు. ఒకో జోన్‌కు జిల్లాస్థాయి, సెక్టార్‌కు మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు.
జాతరలో అన్నీతానై వ్యవహరిస్తున్న మంత్రి సీతక్కకు తన శాఖ నుంచే తొలి నిరసన ఎదురైంది. జాతర నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఎ క్సైజ్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం త ప్పనిసరి. సమయానికి కడుపునిండా తిండి, తాగేందుకు నీరు అందిస్తే తల్లుల సేవలో త రించిపోతారు. ఈసారి మహాజాతర ప్రారంభానికి రెండురోజుల ముందే మేడారంలో పంచాయతీ కార్యదర్శులు తమకు భోజనం పెట్టడంలేదని ఆందోళనకు దిగారు.
ములుగు, జనవరి 27 (నమస్తే తెలంగాణ): సమ్మక్క-సారలమ్మ జాతరలో స్నేహితులతో పొట్ట చేత పట్టుకొని పనికోసం వచ్చిన ఓ వ్యక్తి వైద్యం అందక మృతిచెందిన ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్ (31) ఈనెల 23న స్నేహితులతో కలిసి మేడారం జాతరకు వచ్చాడు. ఐదు రోజులుగా యాటలు కోస్తూ ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం జ్ఞానేశ్వర్ మద్యం సేవించి అస్వస్థతకు గురి కాగా, స్నేహితులు గద్దెల పక్కన ఉన్న టీటీడీ కల్యాణ మండపంలోని దవాఖానకు తరలించారు.

ములుగు డిప్యూటీ డీఎంహెచ్‌వో విపిన్‌కుమార్ నేతృత్వంలో వైద్య బృందం జ్ఞానేశ్వర్‌కు చికిత్స అందించేందుకు కృషిచేశారు. అప్పటికే దవాఖానలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ వైద్యులు సెల్‌ఫోన్ లైట్లతో వైద్యం అందించే ప్రయత్నం చేయగా జ్ఞానేశ్వర్ మృతి చెందాడు. దవాఖానలో కరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో వైద్యం చేయాల్సిన దుస్థితి ఉన్నదని మండిపడ్డారు. అధికారులు 24గంటలు కరెంట్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.