Sammakka Jatara | మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. మరికొద్దిసేపట్లో సమ్మక్క మేడారం గద్దెలపై కొలువుదీరబోతున్నది. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క చిలుకలగుట్ట దిగి జనం జనం మధ్యలోకి చేరుకున్నది. ఈ సందర్భంగా సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు మేడారానికి బయలుదేరారు.
రాత్రి వరకు అమ్మవారు గద్దెలపైకి చేరనున్నారు. ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను గద్దెపైన కొలువుదీర్చనున్నారు. మరో వైపు సమ్మకు స్వాగతం పలుకుతూ దారి పొడువునా మహిళలు ముగ్గులను అలంకరించారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరో వైపు మేడారం భక్తులతో కిక్కిరిపోయింది. జై సమ్మక్క నినాదాలతో మేడారం జాతర పరిసరాలు మార్మోగుతున్నాయి.