ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేశా, కానీ టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలిపారు. డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నారని విమర్శించారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నానని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. ఇంటి ఇంటికి.. గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి తన క్యాడర్‌తో పాటు వస్తున్న తిరుపతిరెడ్డికి హృదయపూర్వక స్వాగతం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని అన్నారు. కానీ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవడం స్వాగతించదగిన విషయమని అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. వారికి పార్టీ సముచిత గౌరవాన్ని అందిస్తుందని తెలిపారు.