TSRTC | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా స్ఫూర్తితో ఇక నుంచి రాష్ట్రంలో ముఖ్య పర్వదినాలైన దసరా, సంక్రాంతి, ఉగాది పండుగల వేళల్లో లక్కీడ్రాలు నిర్వహించి విజేతలకు బహుమతులతో సన్మానిస్తామని టీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ముందస్తు బస్ టికెట్ బుక్ చేసుకొనే ప్రయాణికులకూ ప్రతినెలా లకీడ్రా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. టీఎస్ఆర్టీసీ రాఖీ పౌర్ణమి లకీడ్రా విజేతలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో శుక్రవారం నగదు పురసారాలను ప్రదానం చేసింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి 33 మంది విజేతలకు నగదు పురసారాలను అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా లకీడ్రా ఏర్పాటు చేశామని, ప్రతి రీజియన్‌లో ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.5 లక్షల నగదు బహుమతులను అందజేసినట్టు వివరించారు.
రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, రికార్డు స్థాయిలో సంస్థకు రూ. 22.65 కోట్ల ఆదాయం సమకూరిందని గుర్తుచేశారు. దాదాపు 3 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ లక్కీడ్రాలో పాల్గొన్నారని చెప్పారు. త్వరలో మరో 1,000 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికుల కోసం మరో నాలుగు రూట్లలో లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ఎప్పటికీ మరువలేమని విజేతలైన మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వీ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, సీటీఎం జీవనప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ప, ఆర్ఎంలు శ్రీధర్, ఖుస్రోషా ఖాన్, వరప్రసాద్ పాల్గొన్నారు.
తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తుంటే..
నా పేరు ప్రాంజల్. మాది ఆదిలాబాద్ జిల్లా. ఏడో తరగతి చదువుతున్న. మా తమ్ముడికి రాఖీ కట్టేందుకు గుడిహత్నూర్‌కు బస్సులో వెళ్లా. ఆర్టీసీ లక్కీ డ్రా ఉన్నదని తెలిసి టికెట్‌పై అడ్రస్ రాసి బాక్సులో వేశా. నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. నాకు ఈ నగదు బహుమానం రావడం ఎంతో సంతోషంగా ఉంది.
– కే ప్రాంజల్, 7వ తరగతి విద్యార్థిని, ఆదిలాబాద్ జిల్లా