MBBS | వరంగల్ చౌరస్తా, ఆగస్టు 3: ప్రభు త్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మొదటి విడుత ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మెరిట్ జాబితా లో అర్హత సాధించిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ విధానంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు.
ప్రైవేట్ కళాశాలల్లోని యాజమాన్య కోటా రిజిస్ట్రేషన్లకు సైతం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొన్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను వర్సిటీ ప్రకటిస్తుందని తెలిపారు.