Mastan Sai | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వివిధ రూపాల్లో అమ్మాయిలను ప్రలోభపెట్టి.. వారిని డ్రగ్స్ ఉచ్చులోకి దింపి.. ఆపై లైంగికంగా వేధింపులకు గురి చేసిన రావి మస్తాన్‌సాయి వికృత చేష్టల్లో మరో కోణం తాజాగా వెలుగుచూసింది. ఇప్పటివరకు అమ్మాయిల నగ్న వీడియోలను కేవలం వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు మాత్రమే వినియోగించేవాడని అనుకున్నారు. కానీ ఆ వీడియోలను విదేశీ అశ్లీల వెబ్సైట్లలోకి పంపి లక్షలు ఆర్జించేవాడని తాజాగా వెల్లడైంది. తొలుత వీడియోల తాలూకు ప్రోమోలను అప్లోడ్ చేసి.. ఆసక్తి ఉన్నవారు వాటిని క్లిక్ చేయగానే డాలర్లను డిమాండు చేసేవాడు.
ఒక్కో వీడియోకు 10 డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు వసూలు చేస్తాడు. ఆ తరువాత నిర్ణీత సమయం వరకు వారికి సంబంధిత వీడియో లింకు పంపుతాడు. అయితే నగ్న వీడియోల్లో మహిళలు మస్తాన్‌సాయి చెబుతున్నట్టు వింటున్నందున తమ వీడియోలు అతడిని దాటి బయటికి పోవడంలేదని అనుకుంటున్నారు. కానీ పోర్న్ వెబ్సైట్లలో అవి మస్తాన్‌కు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న విషయం వారికి తెలియదు. మస్తాన్ సాయిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులకు విచారణలో అనేక విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి.
ఈ నెల 2వ తేదీన లావణ్య చేసిన ఫిర్యాదుపై మస్తాన్సాయితోపాటు అదుపులోకి తీసుకున్న షేక్ ఖాజాకు కూడా డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. మస్తాన్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడే అతని బ్యాగులోని ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్, ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పలు కోణాల్లో అనేక విషయాలు వెల్లడైనప్పటికీ మస్తాన్‌సాయి నుంచి ఇంకా అనేక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.