గుమ్మడిదల, ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం గుమ్మడిదలలో వందలాది మంది విద్యార్థులు జాతీయ రహదారి 765-డీపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల నుంచి పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. నింగి నంటేలా నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కాగా గుమ్మడిదలలో చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి.
గురువారం దివ్యాంగులు దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. కాగా నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రిలే నిరాహా రదీక్షలు పదోరోజుకు చేరుకున్నాయి. హైకోర్టు ఆదేశం మేరకు సర్వేయర్ ఏడీ బాల్‌రాజ్, మండల సర్వేయర్ యాదయ్య, గుమ్మడిదల తహసీల్దార్ గంగాభవానీ పర్యవేక్షణలో సర్వే చేపట్టారు. ఈనెల 19వ తేదీ వరకు సర్వే చేపడతామని తహసీల్దార్ పేర్కొన్నారు.