హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా ప్రమోషన్లు, బదిలీలు జరిగాయి. కొంతకాలంగా వేచి చూస్తున్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు(ఎంపీడీవోలు), జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు అడహక్ ప్రాతిపదికన డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా(డిప్యూటీ సీఈవో) ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 మంది ఎంపీడీవోలు/డీపీవోలకు డిప్యూటీ సీఈవోలుగా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 268 విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రమోషన్ పొందిన అధికారులను వివిధ జిల్లాల జిల్లా ప్రజా పరిషత్‌లకు, ఇతర అనుబంధ విభాగాలకు కేటాయించారు. 12 మంది ఎంపీడీవోలను జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీపీ)లకు డిప్యూటీ సీఈవోలుగా ఉద్యోగోన్నతి కల్పించారు.
అదనపు డీఆర్ డీవోలుగా డీఆర్డీఏ విభాగాలకు కేటాయించారు. ప్రమోషన్ పొందిన పలువురు అధికారులను మెప్మా, సెర్ప్, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్, సైనిక సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు డిప్యుటేషన్‌పై పంపారు. ఉద్యోగోన్నతులతోపాటు మరికొందరు అధికారులను బదిలీ చేశారు. ప్రమోషన్, బదిలీ పొందిన అధికారులు వెంటనే తమ ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ అయి, కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియపై తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు సూచించింది. ఉద్యోగోన్నతి పొందిన అధికారులకు 2020 సంవత్సరంలో సవరించిన వేతన శ్రేణి ప్రకారం రూ.62,110-రూ.1,40,470 సేలు వర్తిస్తుంది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996లోని రూల్ 10(ఏ) ప్రకారం ఈ ప్రమోషన్లను తాతాలికంగా కల్పించారు.
ఈ అనురాధ (మహబూబాబాద్), పీ శ్రీనివాసరావు (ఖమ్మం), ఏ సంజీవరావు (పెద్దపల్లి), కే మహాలక్ష్మి (సూర్యాపేట), బీ అప్పారావు (భద్రాద్రి కొత్తగూడెం), ఆర్ అలివేలు మంగమ్మ (నల్లగొండ), బీ సంధ్య (సిద్దిపేట), జే సునీత (మంచిర్యాల), వెంకటయ్య (జనగామ) సీహెచ్ శ్రీనివాస్ (యాదాద్రి భువనగిరి), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (రంగారెడ్డి), కృష్ణ ప్రసాద్ (ములుగు) జిల్లాలకు డిప్యూటీ సీఈవోలుగా నియమితులయ్యారు. నారాయణపేట డీఆర్డీవోగా పనిచేస్తున్న మొగులప్పను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. కామారెడ్డి డీఆర్డీవోగా పనిచేస్తున్న ఎం.సురేందర్ ను అదే జిల్లాకు డిప్యూటీ సీఈవోగా నియమించారు. డీపీవో వీ జగదీశ్వర్ తనకు లభించిన డిప్యూటీ సీఈవో ప్రమోషన్‌పై ప్రస్తుతం చేరడానికి ఆసక్తి లేదని తెలుపడంతో ఆయనను మినహాయించారు.