హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 169 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి తహసీల్దార్లుగా పదోన్నతలు కల్పించింది. రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) మంగళవారం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశమైంది. 2016-17 ప్యానల్ ఇయర్‌కు చెందిన 169 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ నిర్ణయంపై ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్.. సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూశాఖలో ప్రమోషన్లకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 200పైగా సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా త్వరలోనే పదోన్నతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్వోల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి తెలిపారు. పూర్వ వీఆర్వోల సంఘం నాయకులు మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు.