నిజామాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిముద్రలతో వ్యక్తిగత రుణాలు, క్రిడెట్ కార్డులను వారికి ఇప్పించిన ఆ ఏజెంట్ ఒక్కొక్కరి పేర రూ.10లక్షల నుంచి రూ.19 లక్షల వరకు రుణాలను డ్రా చేశాడు. అలా అతడు చెప్పిందల్లా చేసి తమ ప్రమేయం లేకుండానే రుణగ్రహీతల జాబితాలో 30మంది ఇరుక్కుపోయారు. అయితే ఏడాది తర్వాత ఉద్యోగం చూపించకపోగా బాధితులను బెదిరించి ఇండియాకు పంపించడమే గాక ఐపీ నోటీసులతో బాధితులను బెదిరిస్తూ.. అతడు మాత్రం జల్సా జీవితం గడుపుతున్నాడు.
ప్రధాన నిందితుడు నిజామాబాద్, ఆర్మూర్‌కు చెందిన కొంతమందితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. దుబాయ్, ఇజ్రాయెల్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పలువురికి ఆశ పుట్టించారు. ఒక్కొక్కరి నుంచి రూ.6లక్షలు చొప్పున సుమారు రూ.5కోట్లు వసూలు చేశాడు. దుబాయ్‌కి తీసుకెళ్లిన తర్వాత హై ప్రొఫైల్ వసతులతో వారిని బుట్టలో వేసుకొని 30మంది వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అక్రమంగా సంపాదించిన రూ.10కోట్లతో అతడు దుబాయ్‌లోనే తిష్ట వేసినట్టు తెలుస్తున్నది. అయితే దుబాయ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకర్ల నుంచి 30మంది గల్ఫ్ బాధితులకు నిత్యం ఫోన్లు రావడం, క్రెడెట్ కార్డుల బిల్లులు, పర్సనల్ లోన్లు చెల్లించాలని వేధించడంతో మోసోయామని బాధితులు గ్రహించారు. రూ.6లక్షలు చెల్లించి మోసపోవడంతో పాటు తమ పేరిట జారీ చేయబడిన క్రెడిట్ కార్డులు, రుణాలతోనూ బాధితులు కుదేలవుతున్నారు.
ఈ క్రమంలో నందిపేట మండలానికి చెందిన కొంతమంది ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రధాన నిందితుడు, మరో ట్రావెల్స్ నిర్వాహకుడు మినహా నలుగురిని అరెస్టు చేశారు. 90మంది యువకులను మోసం చేసిన వ్యక్తి మాత్రం దుబాయ్‌లో అక్రమ సంపాదనతో జల్సాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడిపై ఇమ్మిగ్రేషన్ యాక్ట్, చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్‌లో ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నప్పటికీ ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. తమ డబ్బులు తిరిగివ్వాలని సదరు ఏజెంట్ వెంటపడ్డా ఫలితం లేదని, తరచూ ఫోన్ నెంబర్లు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి, నిందితుడి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రెండు రోజుల క్రితం పోలీస్ కమిషనర్ సాయిచైతన్యకు వినతిపత్రం అందించారు.
నీలగిరి, డిసెంబర్ 1: అధిక వడ్డీల పేరుతో నల్లగొండ జిల్లాలో మరో భారీ మో సం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేం ద్రంగా టూవెల్త్ క్యాపిటల్స్ సర్వీసెస్ అనే సంస్థ నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన సుమారు 3 వేల మంది దాదాపు రూ.330 కోట్లకుపైగా ఇందులో పెట్టుబడులుగా పెట్టి మోస పోయినట్టు బాధితులు తెలిపారు. బాధ్యుడి ఇంటి ఎదుట బాధితులు సోమవా రం ఆందోళనకు దిగారు. రాపోలు ప్రకాశ్, సోమేశ్వరి అనే ఇద్దరు వ్యక్తులు దుగ్యాల శ్రీనివాస్‌ను ఏజెంట్‌గా చేసుకుని తమ వద్ద డబ్బులు వసూలు చేయించి రియల్ ఎస్టేట్ పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని, వారిపై ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకుని తమకు డబ్బు చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని రాపోలు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.