హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) భారీగా అక్రమ రవాణా అవుతున్నది. దసరా పండుగ సందర్భంగా కొందరు అక్రమారులు ఇతర రాష్ర్టాల నుంచి తకువ ధరలకు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి, ఎయిర్లైన్స్, రైళ్లు, బస్సు మార్గాల్లో దొంగతనంగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఈ నెల 15 నుంచి 30 వరకు ఎన్డీపీఎల్, సారా తయారీ, అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో ఒక్క వారంలోనే 1704 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 68.16 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, భూపాల్పల్లి.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నిత్యం ఎక్సైజ్ సిబ్బందితోపాటు ప్రత్యేక ఎక్సైజ్ టీమ్లు దాడులు నిర్వహించి సారాను అరికడుతున్నట్టు షానవాజ్ ఖాసిం తెలిపారు.