‘అంతా నా ఇష్టం.. నేను చెప్పినట్టే నడుచుకోవాలి.. లేదంటే ఉద్యోగం ఊస్టే..నా మాట వినని వారిని తీసేయండి.. మా వాళ్లను పెట్టుకుంటా..’అని టీజీటీఎస్ చైర్మన్ వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలంగాణకు చెందిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రభుత్వరంగ సంస్థలకు చైర్మన్లుగా నియామకమైన నాయకుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పినట్టే నడుచుకోవాలని హుకూం జారీ చేస్తున్నట్టు సమాచారం. అందుకు నిదర్శనమే టీజీటీఎస్ లిమిటెడ్లో నెలకొన్న పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్(టీజీటీఎస్)లో అంతా నా ఇష్టం అన్నట్టుగా చైర్మన్ మన్నె సతీశ్ చౌదరి వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
తాను చెప్పినట్టే టెండర్ల ప్రక్రియ జరగాలని అధికారులనూ బెదిరిస్తున్న పరిస్థితి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొంత మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను తయారు చేసి, వారిపై ఇతర కారణాలను చూపి వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
తొలగించబోయే ఉద్యోగుల స్థానంలో తన వర్గానికి చెందిన వాళ్లు, బంధువులను ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సతీశ్ చౌదరి తెలంగాణ ఐటీ శాఖలోని కీలకమైన టీజీటీఎస్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. చైర్మన్ తీరుతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు ఈ విషయాన్ని తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ వైస్ చైర్మన్ దేవీప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఐటీ శాఖలో కీలకమైన కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ లిమిటెడ్. ఆ సంస్థ చైర్మన్ పదవి ఆంధ్రా ప్రాంతానికి చెందిన మన్నె సతీశ్ చౌదరికి ఎలా వచ్చిందన్న దానిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ‘తాను బాబు గారి బంధువునని, ఆయన రికమండేషన్తోనే చైర్మన్ అయ్యాను..’ అంటూ హంగామా చేయడంపై పలువురు మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవిని ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన చైర్మన్ కక్షపూరితంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.